ప్రతిపక్షం, జూలై 20: తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై పారదర్శకత పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు వసూలు చేస్తున్న ట్యూషన్ ఫీజు వివరాలను నోటీసు బోర్డులతో పాటు అధికారిక వెబ్‌సైట్‌లోనూ తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది.
అలాగే 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ నివేదికలను జూలై 30లోపు విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది. గడువులోగా నివేదికలు సమర్పించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావడంపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది.


















