లాభాపేక్ష లేకుండా పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం: మంత్రి పొంగులేటి

ప్రతిపక్షం, జూలై 20: తెలంగాణలో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తవుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే రెండు విడతల్లో ఏడు లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు చెప్పారు.

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వాట్సాప్ దరఖాస్తు ప్రక్రియతో పాటు ఎల్‌ఐజీ ఇళ్ల బ్రోచర్‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇప్పటివరకు సొంత స్థలాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందించామని తెలిపారు.

ఇంటి స్థలం లేని పేదల కోసం కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. లాభం, స్వార్థం లేకుండా పేదలకు ఇళ్లు నిర్మించి అందిస్తున్నామని స్పష్టం చేశారు. నగర పరిధిలోని పేదలకు ఇళ్లు అందించే పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇందుకోసం తొలిదశలో 16 నియోజకవర్గాల్లో స్థలాలను ఎంపిక చేసినట్లు చెప్పారు.

528 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నగరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు నిర్మించడంతో పేదలు అక్కడికి వెళ్లలేకపోయారని విమర్శించారు. గతంలో నిర్మించిన కొన్ని ఫ్లాట్లు కూడా సరైన ప్రణాళిక లేకపోవడంతో ఉపయోగకరంగా మారలేదని పేర్కొన్నారు.

చదరపు గజం విలువ లక్షల రూపాయలు ఉన్న నగరంలోని ప్రధాన ప్రాంతాల్లోనే పేదల కోసం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి ఇళ్లు అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పినప్పుడు కొందరు హేళన చేశారని, ఈ పథకం విఫలమైతే విమర్శించేందుకు కొందరు ఎదురుచూశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పేదల ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

నగర పరిధిలోని ఫ్లాట్ల కోసం జులై 21 నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. రూ.10 వేల టోకెన్‌ మొత్తంతో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మీ సేవా కేంద్రాలు, వాట్సాప్, అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

అర్హులైన లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని మంత్రి వివరించారు. డ్రాలో ఇల్లు రాని వారికి చెల్లించిన మొత్తం వెంటనే తిరిగి చెల్లిస్తామని తెలిపారు. ఎంపికైన లబ్ధిదారుల పేరిట స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. అయితే కేటాయించిన ఇళ్లను పదేళ్ల వరకు విక్రయించేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

తొలిదశలో 16 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, త్వరలోనే మిగిలిన నియోజకవర్గాలకు కూడా విస్తరిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాజకీయ పార్టీలు, కులాలు, ఇతర భేదాలకు అతీతంగా అర్హత ఆధారంగానే ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News