గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం.. పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు: మంత్రి శ్రీధర్‌బాబు

ప్రతిపక్షం, జూలై 20: గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ లక్ష్యంతోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

దశాబ్దాల క్రితమే కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తక్కువ ఆదాయ వర్గాల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ గృహ నిర్మాణ సంస్థకు చెందిన కాలనీలు ఉన్నాయని తెలిపారు. పేదల కోసం విలువైన భూములను వినియోగించేందుకు ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు.

పేదలకు ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శకత పాటిస్తామని శ్రీధర్‌బాబు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక నిబంధనల ప్రకారమే జరుగుతుందని తెలిపారు. ఇళ్ల కేటాయింపుల్లో రిజర్వేషన్‌ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

తొలి దశలో 16 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లను నిర్మించనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. అర్హులైన పేదలకు ఇళ్లను అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News