ప్రతిపక్షం, జూలై 20: సీయూఆర్ఈ పరిధిలోని పేద ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లో సొంత స్థలం లేకపోవడంతో ఎంతోమంది పేదలు ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలోనే జీవిస్తున్నారని అన్నారు. అలాంటి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు.
సీయూఆర్ఈ పరిధిలోని పేదలకు ప్రభుత్వమే స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించే పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. పేదలకు ఇళ్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం హౌసింగ్ విభాగాన్ని రద్దు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌసింగ్ విభాగాన్ని పునరుద్ధరించామని తెలిపారు. పేదల గృహ నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.
బల్కంపేట ఎల్లమ్మ బోనాల సందర్భంగా సీయూఆర్ఈ పరిధిలో ఈ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. వచ్చే ఏడాది బోనాల నాటికి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

















