ప్రతిపక్షం, జూలై 21: ఢిల్లీలో సీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా చామల మాట్లాడుతూ.. పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రజా సమస్యలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసి పలువురిని గాయపరిచారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధాని మోదీ ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించకపోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దేశంలో రైతులు ఆందోళనలు చేస్తున్నా కేంద్రం వారిని అడ్డుకుంటోందని ఎంపీ చామల విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.


















