కొడంగల్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. భూసేకరణలో జాప్యం వద్దు: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 22: మక్తల్–నారాయణపేట్–కొడంగల్ ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు (ఎంఎన్‌కేఎల్‌ఐఎస్) పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులు, తాగునీటి ప్రణాళికలు, రహదారుల నిర్మాణం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం సహించబోమని స్పష్టం చేసిన సీఎం, ప్రతి పనికి నిర్దిష్ట గడువు విధించి పూర్తి చేయాలని ఆదేశించారు.

సమావేశంలో మక్తల్–నారాయణపేట్–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, ప్రాజెక్టు అమలులో భూసేకరణ కీలక దశ అని పేర్కొన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా అవసరమైన సర్వేయర్లను వెంటనే నియమించాలని సూచించారు. భూసేకరణకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. భూసేకరణ పూర్తయిన వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.

కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను శాఖలవారీగా సీఎం సమీక్షించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని తెలుసుకుని, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.

నియోజకవర్గంలోని గ్రామాల్లో రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి, ఏ తండాలోనూ రోడ్డు లేదనే పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రతి గ్రామాన్ని మండల కేంద్రంతో బీటీ రోడ్డు ద్వారా అనుసంధానం చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడితే ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మరింత అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు అవసరమైన పంచాయతీ భవనాలను త్వరితగతిన నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఈఈ స్థాయి అధికారిని నియమించి పనుల నాణ్యత, పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే ప్రతి నిర్మాణం నాణ్యతతో పూర్తి కావాలని స్పష్టం చేశారు.

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో నీటి అవసరాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించి, అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, గ్రామీణ మౌలిక వసతులు, తాగునీటి సదుపాయాలు, పరిపాలనా భవనాల నిర్మాణం వంటి అన్ని పనులు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యానికి తావులేదని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఫలితాలు కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Spread the love

Related News

Latest News