ప్రతిపక్షం, జూలై 22: తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు మరికొన్ని రోజులు కొనసాగనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎండల తీవ్రత తగ్గి ప్రజలకు ఉపశమనం లభించింది. ముఖ్యంగా సాగు పనుల కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఇవాళ లేదా రేపటిలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పనులు చేపట్టాలని అధికారులు సూచించారు. అలాగే అత్యవసరమైతే తప్ప వర్షాల సమయంలో బయటకు వెళ్లకూడదని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు.
రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతుండటంతో చెరువులు, కుంటలు, జలాశయాల్లోకి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయని, వర్షాభావ పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశముందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

















