ప్రతిపక్షం, జూలై 22: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తాజాగా ఒక్క రోజులోనే ఏడు కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణలో కూడా కొద్దిచోట్ల కరోనా కేసులు వెలుగుచూస్తున్నట్లు సమాచారం రావడంతో ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.
ముఖ్యంగా హైదరాబాద్ వంటి జనసాంద్రత అధికంగా ఉన్న నగరంలో వైరస్ వ్యాప్తి ప్రారంభమైతే వేగంగా విస్తరించే అవకాశం ఉందని ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరమని సూచిస్తున్నారు.
ప్రస్తుతం బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాలు, ఊరేగింపులు, ప్రజా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో రద్దీ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ప్రమాదం పెరిగే అవకాశముందని వైద్యులు పేర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అత్యవసరమైతే తప్ప రద్దీ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని, బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, దగ్గు లేదా జలుబు లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం, అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవడం మంచిదని తెలిపారు.
కరోనా లక్షణాలు కనిపించిన వారు స్వీయ నిర్బంధంలో ఉండి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

















