ప్రతిపక్షం, జూలై 22: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేడు ‘ఛలో లోక్ భవన్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతల అరెస్టులను నిరసిస్తూ ఈ ఆందోళన చేపడుతోంది.
తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు లోక్ భవన్ వైపు భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఇదే సమయంలో కొడంగల్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెద్దఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

















