ప్రతిపక్షం, జూలై 22: దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసే దిశగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కీలక ఫీచర్‌ను తీసుకురానుంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా కేవలం ఫోన్‌ను పీఓఎస్ (POS) మెషీన్‌కు టచ్ చేయడం ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే ‘ట్యాప్ టు పే’ సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో మారుమూల ప్రాంతాలు, భూగర్భ ప్రాంతాలు లేదా విమాన ప్రయాణ సమయంలో కూడా సులభంగా డిజిటల్ లావాదేవీలు చేయవచ్చు.
ఈ కొత్త వ్యవస్థ ‘నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్’ (NFC) సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. వినియోగదారుడి స్మార్ట్‌ఫోన్‌లో NFC సపోర్ట్ ఉండటంతో పాటు UPI Lite ఖాతాలో ముందుగానే బ్యాలెన్స్ ఉండాలి. చెల్లింపు సమయంలో QR కోడ్ స్కాన్ చేయడం, ఇంటర్నెట్ ఉపయోగించడం లేదా యూపీఐ పిన్ నమోదు చేయడం అవసరం ఉండదు. కేవలం ఫోన్‌ను POS మెషీన్‌కు తాకించగానే లావాదేవీ పూర్తవుతుంది.
ఈ సేవను ఉపయోగించాలంటే ముందుగా ఇంటర్నెట్ ద్వారా UPI Lite వాలెట్లో నగదు జమ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఇంటర్నెట్ అందుబాటులో లేకున్నా POS మెషీన్‌పై ఫోన్‌ను ట్యాప్ చేసి చెల్లింపులు చేయవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ తిరిగి అందుబాటులోకి వచ్చిన తర్వాత లావాదేవీ వివరాలు బ్యాంకింగ్ వ్యవస్థకు సమకాలీకరించబడతాయి.
ప్రస్తుతం ఈ విధానంలో గరిష్ఠంగా రూ.2,000 వరకు మాత్రమే చెల్లింపులు చేసే అవకాశం ఉండనున్నట్లు సమాచారం. చిన్న మొత్తాల లావాదేవీలను మరింత వేగంగా, సురక్షితంగా పూర్తి చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, నెట్వర్క్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులకు ఈ కొత్త సదుపాయం కీలకంగా మారే అవకాశం ఉంది.

















