మూడు కార్పొరేషన్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

ప్రతిపక్షం, జూలై 23: హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో మున్సిపల్ పరిపాలన శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణ పూర్తికాకుండా టెండర్లు పిలవొద్దని సీఎం స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిని ఇప్పటికే నియమించినట్లు వెల్లడించారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో చేపట్టనున్న ప్రాజెక్టులకు అవసరమైన అనుమతుల విషయంలో అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండేలా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహం, జంక్షన్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నగర అభివృద్ధికి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) భవన నమూనా, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవన నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు ఉండేలా పలు సూచనలు చేశారు.

సమీక్ష సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఎంఆర్‌డీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News