2 కిలోల బంగారం, నోట్ల కట్టలు.. ప్రభుత్వ అధికారి అరెస్ట్

ప్రతిపక్షం, జూలై 23: తెలంగాణలో మరో అవినీతి అధికారిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) భారీ చర్యలు చేపట్టింది. ట్రాన్స్‌కోలో డివిజనల్ ఇంజినీర్ (డీఈ)గా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణను అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, ఆయన నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా నగదు, బంగారం, విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

సోదాల సందర్భంగా సుమారు 2 కిలోల బంగారం, రూ.52 లక్షల నగదు, మూడు కార్లు, దాదాపు రూ.30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, 20 ఖరీదైన మద్యం బాటిళ్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా, అధికారికి చెందిన కుటుంబ సభ్యుల పేర్లపై భారీ స్థాయిలో స్థిరాస్తులు ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఆయన భార్య పేరుతో 10 ఫ్లాట్లు, ఖానామెట్‌లో జీ+5 కమర్షియల్ భవనం, మూసాపేట్, ఆంజనేయనగర్ ప్రాంతాల్లో జీ+3 భవనాలు, నాలుగు నివాస ఫ్లాట్లతో పాటు మొత్తం రూ.28.14 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత విస్తరించిన ఏసీబీ, అక్రమాస్తుల మూలాలు, ఆర్థిక లావాదేవీలపై లోతుగా విచారణ చేపట్టింది. ఈ కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

Spread the love

Related News

Latest News