‘కన్నెపల్లి’ నుంచి ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వండి: రాష్ట్రప్రభుత్వం

ప్రతిపక్షం, జూలై 23: ఖరీఫ్ సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ)కు అధికారికంగా లేఖలు పంపింది.

మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోస్తే ఖరీఫ్ సీజన్‌లో సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో పేర్కొంది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఈ ప్రతిపాదనపై కేంద్రం నుంచి అధికారిక స్పందన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతూ వస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడంతో ఈ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది.

Spread the love

Related News

Latest News