ప్రతిపక్షం, జూలై 23: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు పూర్తిగా దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన బలప్రయోగాన్ని నిరసిస్తూ రేపు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్‌వీ) నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటానని వెల్లడించారు.
ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ హక్కును పరిరక్షించేందుకు విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.
విద్యార్థుల సమస్యలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కేటీఆర్ కోరారు. పుట్టినరోజు వేడుకల కంటే ప్రజా సమస్యలపై పోరాటానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

















