ప్రతిపక్షం, జూలై 23: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ నకిలీదేనని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, అందులో ఎలాంటి నిజం లేదని తెలిపాయి.
వైరల్ అవుతున్న లేఖలో జూలై 21 తేదీతో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొనగా, అది పూర్తిగా కల్పితమని అధికారులు వెల్లడించారు. ప్రజలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక వనరుల ద్వారా మాత్రమే సమాచారం నిర్ధారించుకోవాలని సూచించారు.
కాగా, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా ఢిల్లీలో పలు విద్యార్థి సంఘాలు, సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారంటూ నకిలీ లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు తెలుస్తోంది.

















