ప్రతిపక్షం, జూలై 23: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరేనా టెక్నాలజీస్ సంస్థకు సంబంధించి తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొంటూ, 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తనకు గ్లోబరేనా టెక్నాలజీస్ సంస్థతో ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమాన్య హక్కులు లేదా వ్యాపార అనుబంధాలు లేవని నోటీసులో స్పష్టం చేశారు. వాస్తవాధారాలు లేకుండా చేసిన ఆరోపణలు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు, రాజకీయ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు.
నిర్దేశించిన గడువులోగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా కూడా దాఖలు చేస్తానని కేటీఆర్ లీగల్ నోటీసులో హెచ్చరించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
















