క్యూర్ ప్రాంతాలకు 50 ఏళ్ల తాగునీటి ప్రణాళిక.. సమగ్ర మాస్టర్ ప్లాన్‌కు సీఎం ఆదేశాలు

ప్రతిపక్షం, జూలై 24: క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలోని ప్రాంతాలకు దీర్ఘకాలిక తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర తాగునీటి సరఫరా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగునీటి సరఫరాలో ఏకరూపత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని తాగునీటి వనరులను పరస్పరం అనుసంధానం చేయాలని, ఒక వనరు నుంచి సరఫరా నిలిచిపోయినా మరో వనరు ద్వారా ప్రజలకు నీరు అందే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులకోసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతోందని పేర్కొంటూ, ఇకపై అలాంటి పరిస్థితి ఉండకూడదన్నారు. అవసరమైన చర్యలు తీసుకుని రోజు విడిచి రోజు తాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న తాగునీటి సరఫరా పనులను ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని కూడా నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సూచించారు. న్యాయపరమైన అడ్డంకులు ఉంటే వాటిని వేగంగా పరిష్కరించాలని చెప్పారు.

తాగునీటి ప్రాజెక్టులు, మురుగునీటి శుద్ధి కేంద్రాల పనుల పురోగతిపై ప్రతి నెల నివేదిక సమర్పించాలని, పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. భవిష్యత్తులో పరిశ్రమలు, నిర్మాణ రంగంలో గ్రే వాటర్ వినియోగాన్ని ప్రోత్సహించేలా నిబంధనలు రూపొందించాలని కూడా సూచించారు.

Spread the love

Related News

Latest News