విద్యార్థులపై లాఠీఛార్జ్ బాధాకరం.. BJP సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఆవేదన

ప్రతిపక్షం, జూలై 24: ఢిల్లీలో నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషి తప్పుపట్టారు. విద్యార్థుల ఆందోళనను కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడటం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

పరీక్షల నిర్వహణలో పారదర్శకత, న్యాయం కోరుతూ విద్యార్థులు ఆందోళన చేయడం సమంజసమేనని జోషి పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యువత ఢిల్లీకి వచ్చి తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారని, వారి ఆవేదనను ప్రభుత్వం సానుకూలంగా వినాలని సూచించారు.

ముఖ్యంగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై, మహిళా విద్యార్థులపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే వార్తలు బాధ కలిగించాయని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలప్రయోగం కంటే సంభాషణ, చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం వెతకాలని సూచించారు.

నీట్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో, బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విద్యార్థుల ఆందోళనలను సున్నితంగా పరిగణించి, వారి విశ్వాసాన్ని పునరుద్ధరించే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Spread the love

Related News

Latest News