ప్రతిపక్షం, జూలై 24, హైదరాబాద్: నగరంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గణాంకాల ప్రకారం, హైదరాబాద్‌లో గంటకు సుమారు రూ.10 లక్షలు, రోజుకు దాదాపు రూ.2.4 కోట్లు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్తున్నాయి.
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే నగరవాసుల నుంచి సైబర్ మోసగాళ్లు రూ.439 కోట్లు కాజేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడులు, అధిక లాభాల హామీలు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పథకాల పేరుతో భారీ స్థాయిలో మోసాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
బాధితుల నుంచి డబ్బులు కాజేసిన తర్వాత నిందితులు వివిధ బ్యాంకు ఖాతాలు, డిజిటల్ వాలెట్లు, క్రిప్టో లావాదేవీల ద్వారా నిధులను మళ్లిస్తున్నట్లు విచారణలో వెల్లడవుతోంది. దీంతో సైబర్ నేరాలను అరికట్టడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో బాధితుల డబ్బును వీలైనంత త్వరగా నిలిపివేసి తిరిగి అందించేందుకు పోలీసులు కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సమన్వయం చేసి నగదు రికవరీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రజలు అపరిచితుల పెట్టుబడి ఆఫర్లు, అధిక లాభాల హామీలు, అనుమానాస్పద లింకులు, తెలియని యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

















