ప్రతిపక్షం, జూలై 24, హైదరాబాద్: నీట్ పేపర్ లీక్ వ్యవహారం, ఢిల్లీలో జరిగిన నిరసనల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వస్తుంటే కాంగ్రెస్ నేతలే అడ్డుకున్నారని ఆరోపించారు.
మీడియాతో మాట్లాడిన కేటీఆర్, “బడే భాయ్ కోసం చోటే భాయ్ అడ్డుపడుతున్నాడు” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఎవరైనా విమర్శలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అంతగా స్పందిస్తున్నారని ప్రశ్నించారు.
ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లకుండా కొడంగల్‌లోనే నిరసన చేపట్టారని కేటీఆర్ విమర్శించారు. “దేశమంతా ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే, నీట్ పేపర్ లీక్‌కు కేటీఆర్, కేసీఆర్ కారణమని సీఎం ఆరోపించడం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనం” అని మండిపడ్డారు.
నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి రాజకీయ ఆరోపణలకే పరిమితమయ్యారని విమర్శించారు.

















