ప్రతిపక్షం, జూలై 24, హైదరాబాద్: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం చేస్తున్న మోసం యువతకు అర్థమైందని, అందుకే దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఆందోళనకు దిగారని అన్నారు.
మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కేంద్ర ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. “ఈ తరం యువత చావుకు, ఈడీ, సీబీఐ కేసులకు భయపడదు. ఎవరితో పెట్టుకోకూడదో ప్రధాని మోదీ వారితోనే పెట్టుకున్నారు. జాగ్రత్తగా ఉండండి. రాజ్యమా ఉలికిపడు” అంటూ వ్యాఖ్యానించారు.
నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ విమర్శలు చేశారు. “మోదీని ఎవరైనా ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత బాధ? కేంద్రాన్ని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి అనవసరంగా ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం మానుకోవాలి” అని అన్నారు.
నీట్ లీకేజీ వంటి జాతీయ సమస్యలపై రాజకీయాలు చేయకుండా విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.

















