హైదరాబాద్‌లో విషాదం.. సెలవులు ఇవ్వలేదనే మనస్తాపంతో మెడికో ఆత్మహత్య?

ప్రతిపక్షం, జూలై 25, హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారంలో యువ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బెంగళూరులో పీజీ మెడికల్ చదువుతో పాటు ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న దీక్షిత (29) అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

స్థానికుల వివరాల ప్రకారం, యాదాద్రి భువనగిరి జిల్లా మైలారం మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్తె అయిన దీక్షిత బెంగళూరులోని ఓ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతోంది. అదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆమెకు గత మూడు నెలలుగా సెలవులు లభించకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి సమీపంలోని నాగారంలోని ఇంటికి వచ్చినట్లు సమాచారం.

శుక్రవారం అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకిన దీక్షితను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సెలవులు లభించకపోవడం వల్ల వచ్చిన ఒత్తిడే ఈ విషాదానికి కారణమా? లేక ఇతర వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News