•తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం రైతులకు ప్రయోజనకరం : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
•జయన్న తిరుమలాపూర్ గ్రామ రైతు సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జిలెల్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ప్రతిపక్షం, జులై 25, వనపర్తి ప్రతినిధి: ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జిలెల్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.శనివారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో ఎల్‌నినో ప్రభావం, పంట మార్పిడి పై నిర్వహించిన రైతు గ్రామసభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జిలెల్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.డా. జిలెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ, వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా సంప్రదాయ సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
రైతులు కేవలం దిగుబడినే కాకుండా పెట్టుబడి, నీటి లభ్యత, మార్కెట్ అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం తీసుకుంటున్న అవగాహన కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి ద్వారా నష్టాలను తగ్గించుకోవడంతో పాటు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు.వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఏ సందేహం వచ్చినా అధికారులను సంప్రదించాలని సూచించారు. భూసార పరీక్షలు చేయించుకుని వాటి ఆధారంగా ఎరువులు వినియోగిస్తే సాగు వ్యయం తగ్గి దిగుబడి పెరుగుతుందని వివరించారు.వర్షపు నీటిని ప్రతి గ్రామంలో సంరక్షించుకోవడం భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుందని, రైతులు ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంటలు, సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను విస్తృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు.
ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా విజయవంతంగా ఎదుర్కోవచ్చని ఆయన అన్నారు.ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు వరి కాకుండా కందులు, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.వ్యవసాయం, ఉద్యాన శాఖ అధికారుల సలహాలు తీసుకొని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని, అధికారులు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. నీటి వృథాను నివారించి ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని, విద్యుత్ వినియోగంలో కూడా పొదుపు పాటించాలని సూచించారు. పంట పండించడంలో రైతులు ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించాలని, అధికంగా ఎరువుల వినియోగం వల్ల భవిష్యత్తులో భూముల సారం పై ప్రభావం పడే అవకాశం ఉందని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలని మొక్కలు నాటడం వల్ల పర్యావరణం సమతుల్యత పెరిగి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలియజేశారు.
తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం రైతులకు ప్రయోజనకరం : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ… జిల్లాలో ఈ సారి సుమారు 34 శాతం మేర కరవు పరిస్థితులు ఉన్నాయని, సంబంధిత మండలంలో అది 40 శాతం వరకు నమోదైందని తెలిపారు.ఈ ఏడాది వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వర్షాధార సాగు చేసే రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.జయన్న తిరుమలాపూర్ గ్రామంలో సుమారు 3 వేల ఎకరాల్లో సాగు జరుగుతుండగా, అందులో 700 ఎకరాలు పూర్తిగా వర్షాధారంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటల కంటే తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం రైతులకు ప్రయోజనకరమని సూచించారు. రాబోయే పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, సందేహాలుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకు సాగు చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు.జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మండల ప్రత్యేక అధికారి, డివైస్ ఓ సుధీర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, స్థానిక గ్రామ సర్పంచ్ గోపాల్, నాయకులు యాదయ్య, ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



















