ప్రతిపక్షం, జూలై 25, హైదరాబాద్: తుంగతుర్తి నియోజకవర్గంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే మందుల సామెల్ ఘాటుగా స్పందించారు. తనకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించింది రాజ్‌గోపాల్ రెడ్డి కాదని, పార్టీ అధిష్ఠానం అయిన ఏఐసీసీయేనని స్పష్టం చేశారు.
శనివారం మీడియాతో మాట్లాడిన సామెల్, తాను రాజ్‌గోపాల్ రెడ్డి కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో చేరానని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం పార్టీ అధిష్ఠానానిదేనని, వ్యక్తిగతంగా ఎవరూ టికెట్లు ఇప్పించలేరని అన్నారు.
రాజ్‌గోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన, “నాకు టికెట్ ఇచ్చింది ఏఐసీసీ.. రాజ్‌గోపాల్ రెడ్డి కాదు” అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభించిందని పేర్కొంటూ, “నాకు రెడ్లు ఓటేశారు.. రాజ్‌గోపాల్ రెడ్డికి మాదిగలు ఓటేశారు. కేవలం రెడ్లు, దళితులతోనే రాజ్యం నడవదు” అని వ్యాఖ్యానించారు.
అలాగే, తన నియోజకవర్గానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని సామెల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో తనకు కూడా బలమైన పార్టీ క్యాడర్ ఉందని, అక్కడ రాజ్‌గోపాల్ రెడ్డిని గెలిపించినందుకు తమ కార్యకర్తలు బాధపడుతున్నారని అన్నారు.
ఇటీవల తుంగతుర్తిలో తాను తీసుకొచ్చిన వ్యక్తికే కాంగ్రెస్ టికెట్ ఇప్పించానని రాజ్‌గోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, సామెల్ చేసిన ఈ ప్రతిస్పందన రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతల మధ్య ఈ మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

















