ప్రతిపక్షం, జూలై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ఉద్యమానికి పరోక్షంగా సీజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలే బలాన్నిచ్చాయని చెబుతూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
తమను “బొద్దింకలు” అని సంబోధించకపోయి ఉంటే ఈ స్థాయిలో ఉద్యమం జరిగేది కాదని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా వచ్చి ఉండకపోవచ్చని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ఈ ఉద్యమం విద్యార్థుల ఐక్యతకు నిదర్శనమని ఆయన అన్నారు.
ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ నిరుద్యోగులను ఉద్దేశించి “బొద్దింకల్లాంటి నిరుద్యోగులు” అని వ్యాఖ్యానించారనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అనంతరం ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ అభిజీత్ దీప్కే CJP సంస్థను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
అయితే, తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారని, తాను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదని సీజేఐ సూర్యకాంత్ గతంలోనే వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం అభిజీత్ దీప్కే చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీశాయి.

















