21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 26, హైదరాబాద్: దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే జెన్‌జీ (Gen Z) యువతకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన చట్ట సవరణను పార్లమెంట్‌లో తీసుకురావాలని కోరారు.

హైదరాబాద్‌లో “యువతే దేశం – దేశమే యువత” పేరుతో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. నీట్ వంటి పరీక్షల్లో జరిగిన అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, వాటి కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆత్మహత్యలు, దేశవ్యాప్తంగా సాగుతున్న యువజన ఉద్యమాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ శాసనసభ, శాసనమండలిని ప్రత్యేకంగా సమావేశపరచి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించి పంపనున్నట్లు ప్రకటించారు.

21 ఏళ్లకే ఐఏఎస్ అవుతుంటే ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు?

21 ఏళ్ల వయసులో యువత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల్లో చేరుతున్నప్పుడు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశాన్ని ఎందుకు నిరాకరించాలని సీఎం ప్రశ్నించారు. శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే వయోపరిమితిని 21 ఏళ్లకు, రాజ్యసభకు 25 ఏళ్లకు నిర్ణయించేలా చట్ట సవరణ చేయాలని సూచించారు.

యువత గొంతు చట్టసభల్లో వినిపించాల్సిన అవసరం ఉందని, వారి ఆలోచనలు, అవసరాలు, ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. యువతే దేశ భవిష్యత్తని, దేశ నిర్మాణంలో వారికి కీలక పాత్ర ఉండాలని అభిప్రాయపడ్డారు.

రాజీవ్ గాంధీ, పీవీ నిర్ణయాలను గుర్తు చేసిన సీఎం

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని రేవంత్ గుర్తు చేశారు. అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించేలా చట్ట సవరణ చేశారని చెప్పారు.

ఇతర దేశాల ఉదాహరణలు ప్రస్తావన

జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల్లో 18 ఏళ్లు నిండిన వారికే చట్టసభలకు పోటీ చేసే అవకాశం ఉందని, సింగపూర్‌లో 21 ఏళ్ల వయస్సులోనే ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని సీఎం పేర్కొన్నారు. అలాంటి అవకాశాలు భారత యువతకు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.

పార్లమెంట్‌లో చట్ట సవరణకు ప్రయత్నం

తెలంగాణ శాసనసభలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపడమే కాకుండా, పార్లమెంట్‌లో బిల్లు తీసుకొచ్చి చట్టసవరణ జరిగేలా ప్రయత్నిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 21 ఏళ్ల వయస్సులోనే యువత కీలకమైన విద్య, సమాచార సాంకేతిక శాఖల వంటి రంగాల్లో మంత్రులైతే దేశ ముఖచిత్రం మారుతుందని అభిప్రాయపడ్డారు.

“జెన్‌జీ గళం చట్టసభల్లో వినిపించాలి”

“జెన్‌జీ వెల్లువ ఇక్కడితో ఆగకూడదు. రాబోయే రోజుల్లో యువత గళం చట్టసభల్లో బలంగా వినిపించాలి. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు మేమంతా బాధ్యత తీసుకుంటాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రస్తుతం దేశ జనాభాలో దాదాపు 30 శాతం జెన్‌జీ యువత ఉన్నప్పటికీ, చట్టసభల్లో వారికి ఒక్క శాతం కూడా ప్రాతినిధ్యం లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు.

ఈ ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News