రేషన్ కార్డుదారులకు శుభవార్త

ప్రతిపక్షం, జూలై 27, హైదరాబాద్: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే ప్రక్రియకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో పౌరసరఫరాల శాఖ వెంటనే పంపిణీ ఏర్పాట్లను ప్రారంభించింది.

రేషన్ బియ్యాన్ని మూడు నెలలకు ఒకేసారి పంపిణీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు రేషన్ డీలర్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భావించిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి మార్గం సుగమమైంది.

హైకోర్టు నిర్ణయం అనంతరం పౌరసరఫరాల శాఖ 64.80 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని విడుదల చేసింది. జిల్లాల వారీగా గోదాముల నుంచి వెంటనే సంబంధిత రేషన్ దుకాణాలకు బియ్యాన్ని తరలించాలని అధికారులను ఆదేశించింది. సరఫరా ప్రక్రియను వేగవంతం చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేసింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల బియ్యం పంపిణీ చేపట్టే అవకాశం ఉంది. రేషన్ కార్డుదారులు తమకు కేటాయించిన రేషన్ దుకాణాల్లో నిర్ణీత తేదీల్లో బియ్యాన్ని పొందవచ్చని అధికారులు తెలిపారు.

పంపిణీ సమయంలో బయోమెట్రిక్ ధృవీకరణతో పాటు ఇతర నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లబ్ధిదారులు రేషన్ తీసుకున్న తర్వాత రసీదు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత పౌరసరఫరాల అధికారులను లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

మూడు నెలల రేషన్‌ను ఒకేసారి అందించడం ద్వారా లబ్ధిదారులకు సౌకర్యం కల్పించడంతో పాటు పంపిణీ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని పౌరసరఫరాల శాఖ పేర్కొంది.

Spread the love

Related News

Latest News