ప్రతిపక్షం, జూలై 27: ఆదిలాబాద్ జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర దొంగల ముఠాల గుట్టురట్టు చేశారు. కేవలం విరిగిన నంబర్‌ప్లేట్ ముక్కను ఆధారంగా తీసుకుని చేపట్టిన దర్యాప్తుతో భారీ నేరాల నెట్‌వర్క్‌ను వెలికితీశారు. గత పది రోజుల వ్యవధిలో వివిధ రకాల నేరాలకు సంబంధించి 30 మందిపై కేసులు నమోదు చేసి, 22 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
జూలై 17 నుంచి 25 వరకు జాబ్ ఫ్రాడ్, నకిలీ ఆన్‌లైన్ లోన్ మోసాలు, బైక్ దొంగతనాలు, ఇళ్ల చోరీలు, ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలు, బ్యాంకుల వద్ద నగదు చోరీలకు పాల్పడుతున్న ఆరు అంతర్రాష్ట్ర ముఠాలను పోలీసులు ఛేదించారు. టెక్నాలజీతో పాటు నిఘా వ్యవస్థను సమర్థంగా వినియోగించి వరుస కేసులను గంటల వ్యవధిలోనే పరిష్కరించారు.
తాజాగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠా కేసులో విరిగిన నంబర్‌ప్లేట్ కీలక ఆధారంగా మారింది. రిమ్స్ సమీపంలో ఆటో చోరీ యత్నం అనంతరం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కుప్టి ఘాట్ వద్ద తనిఖీల సమయంలో అనుమానాస్పద కారును ఆపగా నిందితులు కత్తులతో బెదిరించి పరారయ్యారు. అయితే కారుపై ఉన్న విరిగిన నంబర్‌ప్లేట్ ఆధారంగా విచారణ కొనసాగించిన పోలీసులు, వాంకిడి చెక్‌పోస్టు వద్ద అదే వాహనాన్ని గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిర్మల్ జిల్లాకు చెందిన యాసర్, మహ్మద్ అద్నాన్ అహ్మద్ అలియాస్ సోహెల్ ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. అద్దె కారును వినియోగించి బైక్‌లు, ఆటోలను దొంగిలించి, ఇతర సభ్యుల ద్వారా విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేయగా, 10 మందిని అరెస్టు చేసి, మరో ఆరుగురి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది.
నిందితుల వద్ద నుంచి 7 బైక్‌లు, 3 ఆటోలు, ఒక కారు, ఒక కత్తి, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో వరుసగా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఈ ముఠాను పట్టుకోవడం ఆదిలాబాద్ పోలీసుల కీలక విజయంగా నిలిచింది.


















