ప్రతిపక్షం, జూలై 27: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు సంస్థ అయిన సింగరేణికి మాజీ సీఎం కేసీఆర్ తీరని ద్రోహం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఎన్టీపీసీకి బొగ్గు సరఫరా అవుతోందని తెలిపారు.
కేంద్రానికి 49 శాతం, తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉన్న సింగరేణిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ వేదికగా ఉపయోగించుకుందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సంస్థ ఆదాయానికి తీవ్ర నష్టం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సింగరేణి పరిస్థితిలో ఆశించిన మార్పులు కనిపించడం లేదని విమర్శించారు. సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

















