ప్రతిపక్షం, జూలై 28, సిద్దిపేట: జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (USFI) సిద్ధిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ఛలో కలెక్టరేట్’ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి USFI తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్లాపురం మధు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం, సంబంధిత అధికారులు విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో కలెక్టరేట్ ముట్టడి చేపట్టినట్లు తెలిపారు.
కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బాత్రూంల పక్కనే ఏర్పాటు చేసిన గదుల్లో పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని, వారికి తక్షణమే శాశ్వత పాఠశాల భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలోని ప్రతి ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టం ప్రకారం 25 శాతం ఉచిత విద్యను పేద విద్యార్థులకు అమలు చేయాలని, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలను చెల్లించాలని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV), సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బీసీ, ఎస్సీ కళాశాల హాస్టళ్లను ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న MEOలు, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, సంక్షేమ వసతి గృహాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను అమలు చేయని వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని USFI నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


















