తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక

ప్రతిపక్షం, జూలై 28: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈరోజు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కొనసాగే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, మన్యం, పోలవరం పరిసర ప్రాంతాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశముందని వెల్లడించింది.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని, వాగులు, వంకలు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పనులు చేపట్టాలని సూచించారు.

Spread the love

Related News

Latest News