ప్రతిపక్షం, జూలై 28: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన మహిళ మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) న్యూజెర్సీలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం ప్రకారం, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపి ఉండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
దీపారెడ్డి, ఆమె భర్త రామకృష్ణారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి సంస్కృత, హర్షిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఈ విషాద వార్తతో ఆకుతోటపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దీపారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

















