ప్రతిపక్షం, జూలై 28: హైడ్రా పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా ఉన్నతాధికారిగా ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వ విచక్షణాధికారమని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడిన సీఎం, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు పెద్దవారైనా, పేదవారైనా ఉపేక్షించబోమన్నారు.
గండిపేట బతుకమ్మ కుంటలు, ఎన్ కన్వెన్షన్ వంటి ఆక్రమణలను ప్రస్తావిస్తూ కబ్జాదారులకు అండగా నిలవొద్దని ప్రతిపక్షాలను నిలదీశారు. హైడ్రా ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక సంస్కరణ అని పేర్కొంటూ, విశ్రాంత ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్‌పై 400కుపైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ నేతలు దురుద్దేశంతో కోర్టులను తప్పుదోవ పట్టించేలా కేసులు వేశారని ఆరోపించిన సీఎం, హైకోర్టు పూర్తి తీర్పును అధ్యయనం చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైడ్రాపై డబ్బులు వెచ్చించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
పరీక్షల నిర్వహణపై మాట్లాడుతూ, ఆఫ్‌లైన్ పరీక్షల వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని, అక్రమాలకు పాల్పడిన వారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవహారాల్లో రాష్ట్రాల అధికారాలను కేంద్రం కుదించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి పారదర్శకంగా నియామకాలు చేపట్టామని తెలిపారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరినట్లు సీఎం వెల్లడించారు. అదనంగా గ్రామీణాభివృద్ధి పనులకు ఆమోదం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఉపాధి హామీ పనులతో అనుసంధానం చేయాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

















