తెలంగాణకు 11.56 లక్షల ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వినతి

ప్రతిపక్షం, జూలై 28: తెలంగాణలో పేదలకు గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద రాష్ట్రానికి 11.56 లక్షల ఇళ్లను తక్షణమే కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కృషి భవన్‌లో కేంద్ర మంత్రితో సమావేశమైన సీఎం, రాష్ట్రంలోని గ్రామీణ గృహ అవసరాలు, ఉపాధి హామీ పథకం విస్తరణ, రైతుల జీవనోపాధి మెరుగుదలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ఆయన ముందుంచారు.

సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని సీఎం వివరించారు. గత పదేళ్లలో రాష్ట్రంలో PMAY-G పథకాన్ని సమర్థంగా వినియోగించకపోవడంతో వేలాది గ్రామీణ కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురుచూడాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తూ గృహహీన కుటుంబాలకు శాశ్వత నివాసం కల్పించే దిశగా చర్యలు చేపట్టిందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆవాస్ ప్లస్ (Awaas+) యాప్ ద్వారా నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలు గుర్తించబడినట్లు సీఎం వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఇళ్ల కేటాయింపును ఆమోదించాలని, పేదల ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని సీఎం వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) పరిధిలో అదనపు పనులను చేర్చాలని కేంద్రాన్ని కోరారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే విధంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.

రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్లు, ఇంటి పరిసరాల్లో కూరగాయలు, ఆకుకూరల సాగు, వెదురు వనాల అభివృద్ధి వంటి పనులను కూడా ఉపాధి హామీ కార్యక్రమంలో చేర్చాలని సీఎం ప్రతిపాదించారు. దీంతో రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు పంటల వైవిధ్యీకరణకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.

అలాగే కొండ ప్రాంతాలు, వాలువారిన భూముల్లో నీటి నిల్వ కందకాలు, తేమ సంరక్షణ కోసం ట్రెంచ్‌ల నిర్మాణం, వరదలు మరియు ఇసుక మేటలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ వంటి పనులను కూడా ఉపాధి హామీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఇవి ఉపయోగపడతాయని కేంద్ర మంత్రికి వివరించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులకు 90 రోజులపాటు పనులు చేసే అవకాశం గతంలో ఉన్న విషయాన్ని గుర్తుచేసిన సీఎం, అదే విధానాన్ని కొత్త గ్రామీణ ఉపాధి కార్యక్రమంలోనూ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఇళ్ల నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా గ్రామీణ కుటుంబాలకు అదనపు ఉపాధి కూడా లభిస్తుందని తెలిపారు.

అదనంగా స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించే ఇతర అభివృద్ధి పనులను కూడా కేంద్ర గ్రామీణ ఉపాధి కార్యక్రమంలో చేర్చే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

ఈ సమావేశంలో ఎంపీలు ఎం. అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేష్ షేట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, గడ్డం వంశీకృష్ణతో పాటు ఎక్స్-అఫిషియో స్పెషల్ సెక్రటరీ రామకృష్ణారావు, సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం సమర్పించిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణకు ఇళ్ల కేటాయింపుతో పాటు గ్రామీణాభివృద్ధి, ఉపాధి కార్యక్రమాల విస్తరణకు కేంద్రం నుంచి త్వరలోనే అనుకూల నిర్ణయం వెలువడే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Spread the love

Related News

Latest News