- విద్యార్థులకు స్టైలిష్ యూనిఫామ్‌లు
- 27 లక్షల మందికి కొత్త రంగులు, ఆధునిక డిజైన్లు
- 6, 7 తరగతుల అబ్బాయిలకు ప్యాంట్లు తప్పనిసరి
- బూట్లు, సాక్సులు, బెల్టులు ఉచితం
- గురుకుల విద్యార్థులకు ప్రత్యేక గ్రాండ్ కిట్
- 2 లక్షల మంది జూనియర్ కళాశాల విద్యార్థులకు కిట్
- మహిళా స్వయం సహాయక సంఘాలతో యూనిఫాంల కుట్టింపు
ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ/కరీంనగర్, జూలై 28: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం కొత్త ఉత్సాహాన్ని నింపేలా ప్రభుత్వం సరికొత్త యూనిఫాంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న రెడ్ యాష్ రంగు యూనిఫాంలకు వీడ్కోలు పలికి, ఆధునిక డిజైన్లు, ఆకర్షణీయమైన రంగులతో కొత్త యూనిఫాంలను ప్రవేశపెట్టింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తరహాలో సరికొత్త రూపంలో తరగతులకు హాజరుకానున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలను ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లో అబ్బాయిలకు లైట్ బ్లూ షర్టులు, ముదురు నీలం రంగు ప్యాంట్లు, అమ్మాయిలకు లైట్ బ్లూ టాప్స్, ముదురు నీలం బాటమ్స్‌ను అందించనున్నారు. గురుకుల పాఠశాలల విద్యార్థులకు మెరూన్ చెక్స్ టాప్‌తో పాటు ప్లెయిన్ మెరూన్ లోవర్స్ను కేటాయించారు.విద్యాశాఖ తీసుకున్న కీలక నిర్ణయంతో 6, 7 తరగతుల అబ్బాయిలు కూడా ఇకపై తప్పనిసరిగా ప్యాంట్లే ధరించాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి.
- నాణ్యమైన వస్త్రంతో యూనిఫాంలు
యూనిఫాంలు ఎక్కువ కాలం మన్నేలా ప్రముఖ మఫత్‌లాల్ సంస్థ నుంచి 2.41 కోట్ల మీటర్ల వస్త్రాన్ని, తెలంగాణ చేనేత సంస్థ నుంచి 55.32 లక్షల మీటర్ల నాణ్యమైన వస్త్రాన్ని ప్రభుత్వం సేకరించింది. - యూనిఫామ్‌తో పాటు పూర్తి కిట్
ప్రభుత్వ పాఠశాలల చరిత్రలో తొలిసారిగా విద్యార్థులకు యూనిఫాంలతో పాటు బూట్లు, సాక్సులు, బెల్టులు కూడా ఉచితంగా అందించనున్నారు. గురుకుల విద్యార్థులకు బ్యాగు, టై, బెడ్డింగ్, ప్లేటు, గ్లాసుతో కూడిన ప్రత్యేక కిట్‌ను పంపిణీ చేయనున్నారు.అంతేకాకుండా, రాష్ట్రంలోని 2 లక్షల మంది ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా బ్యాగు, బెల్టు, టై, బూట్లు, సాక్సులను ప్రభుత్వం అందజేయనుంది. యూనిఫాంల కుట్టు బాధ్యతను పూర్తిగా మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తోంది.

















