ప్రతిపక్షం, జూలై 29: నేడు గురుపూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ. మహాభారత రచయిత వేదవ్యాస మహర్షి జయంతి సందర్భంగా ఈ పవిత్ర దినాన్ని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. వేదవ్యాసుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారమని పురాణాలు పేర్కొంటాయి. వేదాలను విభజించి, భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన మహనీయుడిగా ఆయనకు విశిష్ట స్థానం ఉంది.
పురాణాల ప్రకారం, మానవాళికి ఆదిగురువైన శివుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా కూడా గురుపూర్ణిమను భావిస్తారు. అందుకే ఈ రోజున గురువులను స్మరించడం, వారికి కృతజ్ఞతలు తెలపడం భారతీయ సంస్కృతిలో గొప్ప సంప్రదాయంగా కొనసాగుతోంది.
మనకు అక్షరజ్ఞానం, విలువలు, జీవిత పాఠాలు నేర్పిన ప్రతి గురువు మన విజయానికి పునాది. తల్లిదండ్రుల తర్వాత జీవితానికి దారి చూపే మార్గదర్శి గురువే. ఈ పవిత్ర రోజున మీకు విద్య, విజ్ఞానం, సంస్కారం అందించిన గురువులను స్మరించుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేయండి.
“గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.”
గురువే దైవం… గురువుల పట్ల ఎల్లప్పుడూ గౌరవం, కృతజ్ఞత కలిగి ఉండండి.

















