ప్రతిపక్షం, జూలై 29: తెలంగాణలో నిర్ణయించిన ఫీజులకు మించి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్న ఇంజినీరింగ్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (TAFRC) హెచ్చరించింది.
అడ్మిషన్, కెరీర్ డెవలప్మెంట్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ తదితర పేర్లతో విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని కమిటీ వెల్లడించింది. ఇటువంటి చర్యలు నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
అదనపు ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే సంబంధిత కళాశాలలపై చట్టపరమైన చర్యలతో పాటు రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు రసీదులు, చెల్లింపు ఆధారాలు వంటి సాక్ష్యాలతో TAFRC కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించింది.
అనుమతి లేని పేర్లతో ఎలాంటి అదనపు రుసుములు చెల్లించవద్దని, ఫీజుల విషయంలో అవకతవకలు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కమిటీ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది.

















