ప్రతిపక్షం, జూలై 29: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లిలో ఇంటర్ విద్యార్థి తరుణ్ (17) ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది. చదువులో ప్రతిభ కనబరిచిన తరుణ్, ఫస్ట్ ఇయర్ ఇంటర్లో 440 మార్కులకు 434 మార్కులు సాధించి జిల్లా రెండో ర్యాంక్ సాధించాడు.
విద్యార్థి రాసినట్లు చెబుతున్న సూసైడ్ లెటర్లో, కళాశాలకు చెందిన ఓ మహిళా లెక్చరర్ తనను అందరి ముందు అవమానించిందని పేర్కొన్నాడు. “నీకంటే మరో విద్యార్థికి ఒక మార్కు ఎక్కువ వచ్చింది” అంటూ హేళన చేసిందని, తాను అది సరికాదని ప్రశ్నించగా, “నువ్వేమైనా మంత్రి కొడుకువా?” అంటూ చెంపపై కొట్టిందని లేఖలో ఆరోపించాడు.
అలాగే, “పేద విద్యార్థులకు ఆత్మగౌరవం ఉండదా?” అనే ఆవేదనను కూడా లేఖలో వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సూసైడ్ లెటర్ ప్రామాణికత, అందులో చేసిన ఆరోపణలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనపై పూర్తి నిజానిజాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెలుగులోకి రావాల్సి ఉంది.

















