ప్రతిపక్షం, జూలై 29: తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన టెండర్ల విధానాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో కొత్త టెండర్ విధానాన్ని రూపొందించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ నేతృత్వంలో 12 మంది సభ్యులతో ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇరిగేషన్, పంచాయతీరాజ్, రోడ్లు–భవనాలు (R&B), గ్రామీణ నీటి సరఫరా (RWS), వైద్యారోగ్య శాఖల టెండర్ ప్రక్రియలను సమగ్రంగా సమీక్షించి కొత్త మార్గదర్శకాలను రూపొందించనుంది.
టెండర్లకు ఆహ్వానం పలికే విధానం, అంచనా వ్యయాల నిర్ణయం, పనుల అమలులో జాప్యాలు, బిల్లుల చెల్లింపుల ప్రక్రియ, అక్రమాలకు అవకాశం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సిఫార్సులు చేయనుంది. ప్రభుత్వ పనుల్లో పారదర్శకత పెంచడం, పోటీని ప్రోత్సహించడం, అవినీతికి తావులేకుండా వ్యవస్థను బలోపేతం చేయడం కమిటీ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.
ఈ కమిటీ నెల రోజుల్లోపు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని అన్ని కీలక శాఖల్లో కొత్త టెండర్ విధానాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో టెండర్ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

















