ప్రతిపక్షం, జూలై 29: ఢిల్లీలో జరిగిన టీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా (HYDRAA) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిధిలోని శాఖ అని, దానికి సంబంధించిన అన్ని అంశాలపై తుది నిర్ణయం ముఖ్యమంత్రే తీసుకుంటారని స్పష్టం చేశారు.
హైడ్రాపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. అవి పూర్తిగా అర్థరహితమైనవని పేర్కొంటూ, ప్రభుత్వం చట్టబద్ధంగా తన విధులను కొనసాగిస్తోందన్నారు.
సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే రాజకీయ కార్యాచరణపై విస్తృతంగా చర్చించినట్లు ఉత్తమ్ వెల్లడించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులంతా సమన్వయంతో పని చేయాలని అధిష్ఠానం సూచించిందన్నారు.
అలాగే, త్వరలో జరగనున్న ఎంఎల్‌సీ ఎన్నికల అంశంపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థంగా తీసుకెళ్లడంతో పాటు పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు.

















