ప్రతిపక్షం, జూలై 29: హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షాల సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన వర్షాలు బుధవారం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో సాయంత్రం 7 గంటల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గత రాత్రి కురిసిన వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కావడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. రహదారులపై నీరు నిలవడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐటీ సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు వీలైనంత త్వరగా కార్యాలయాల నుంచి బయలుదేరాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం తీవ్రత పెరిగే అవకాశమున్నందున అవసరం లేకుండా బయటకు రావొద్దని, నీరు నిలిచే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించాలని సూచించారు.





























