•ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన విద్య వైద్యం అందించడమే లక్ష్యం
•జనతా వికాస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్యాల మురళీధర్ గుప్తా
ప్రతిపక్షం, జులై 29, వనపర్తి ప్రతినిధి: దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను అందించాలన్న లక్ష్యంతోనే ‘జనతా వికాస్ పార్టీని’ ఏర్పాటు చేశామని జనత వికాస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్యాల మురళీధర్ గుప్తా చెప్పారు. బుధవారం ఆయన హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 20న హైదరాబాదులోని హయత్ నగర్ 14 వ వార్డులో జనతా వికాస్ పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపక సభ్యుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.ఈ సమావేశంలో జనతా వికాస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్యాల మురళీధర్ గుప్తా ను, పొలుమూరి హర్షవర్ధన్ ను నేషనల్ జనరల్ సెక్రెటరీగా, ఎం. అభినయ్ ను నేషనల్ ట్రెజరర్ గా ఎన్నుకున్నట్లు చెప్పారు.
దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను అందించాలన్న లక్ష్యంతో మేధావులు, విద్యావంతులు, ప్రజాసంఘాల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, రైతులు, సామాజిక కార్యకర్తలు ఏకగ్రీవంగా జనతా వికాస్ పార్టీ అనే జాతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు.ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని, వ్యవసాయానికి పెద్దపీట వేయాలని, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం, దేశ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయడం పార్టీ ప్రధాన లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నారు. పార్టీ జాతీయ, రాష్ట్ర, ఇతర సంస్థ గత కమిటీలను జాతీయ అధ్యక్షుడు నాయకత్వంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు ఆసిరెడ్డి, ఇస్రంపల్లి సుదర్శన్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

















