[t4b-ticker]

నేటి నుంచే ధరల షాక్.. ఎలక్ట్రానిక్స్ నుంచి కార్ల వరకు భారీ పెంపు

ప్రతిపక్షం, ఆగస్టు 01: సామాన్య ప్రజలపై ధరల భారం మరోసారి పెరగనుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో ముడి పదార్థాల ధరలు పెరగడంతో పలు ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన కంపెనీలు, ఆ కొత్త ధరలను నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చాయి.

ధరల పెంపు ప్రభావం ముఖ్యంగా టీవీలు, ఫ్రిజ్‌లు, దుస్తులు, ప్యాసింజర్ వాహనాలు, హెయిర్ ఆయిల్, ప్యాకేజ్డ్ టీ వంటి ఉత్పత్తులపై పడనుంది. వీటితో పాటు పలు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. దీంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆటోమొబైల్ రంగంలోనూ ధరల పెంపు అమల్లోకి వచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు మారుతీ సుజుకి, హోండా తమ వాహనాల ధరలను పెంచాయి. ముడి పదార్థాల ధరలు, ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు వెల్లడించాయి.

ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ఉపయోగించే కీలక ముడి పదార్థాల ధరలు పెరగడం, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై యుద్ధ ప్రభావం పడటం వల్ల తయారీ వ్యయం గణనీయంగా పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా వినియోగ వస్తువుల తయారీ సంస్థలు కూడా పెరిగిన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ధరలను సవరించాయి.

ధరల పెంపుతో పండుగల సీజన్‌కు ముందు వినియోగదారులపై అదనపు భారం పడనుండగా, కొనుగోళ్లు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love

Related News

Latest News