ప్రతిపక్షం, ఆగస్టు 01: తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. సుమారు 10 నుంచి 15 రోజుల పాటు కొనసాగే ఈ విదేశీ పర్యటనలో పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన సీఈవోలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌తో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ, డేటా సెంటర్లు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (GCCలు), తయారీ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి అంశాలను పెట్టుబడిదారులకు వివరించే అవకాశం ఉంది.
అమెరికా, కెనడాలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు ఆహ్వానం పలకనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ, ఫార్మా, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, గ్రీన్ ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
ఇటీవలే తెలంగాణను దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ స్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడం, రాష్ట్ర జీడీపీలో వాటాను మరింత పెంచడం, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ విదేశీ పర్యటన ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.
ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్, తేదీలను ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. విదేశీ పర్యటన అనంతరం తెలంగాణకు భారీ పెట్టుబడి ఒప్పందాలు వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

















