ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ఆగస్టు 01: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని గల్లీగల్లీని అభివ్రుద్ధి చేస్తానని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పరామర్శలతో బిజీబిజీగా గడిపారు. ఉదయం 9 గంటలకు తన నివాసం వద్దకు వచ్చిన సందర్శకులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్ ఆ తరువాత 10.30 గంటలకు స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులతో కలిసి పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత 48వ డివిజన్ లోని విద్యానగర్ కురుమవాడలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తోపాటు స్థానిక కార్పొరేటర్ కర్ర పద్మ అనిల్ తో కలిసి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం 19వ డివిజన్ లోని రేకుర్తి ముదిరాజ్ కాలనీకి వెళ్లిన కేంద్ర మంత్రి రూ.40 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అట్లాగే లక్ష్మీ నరసింహ కాలనీలో రూ.57 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుండి మొగ్దుంపూర్ వెళ్లిన కేంద్ర మంత్రి రూ.10 లక్షల జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మహిళాశక్తి ధరణి గ్రామైఖ్య సంఘ భవనాన్ని స్థానిక సర్పంచ్ శివకుమార్ తో కలిసి ప్రారంభించారు. అట్లాగే రూ.15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ ను ప్రారంభించారు. అంతకుముందు చింతకుంట వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంబేద్కర్ భవన్ సమీపంలో నిర్వహించిన ‘‘వన మహోత్సవం-2026’’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు అధికారులతోపాటు మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి స్వయంగా మొక్కలను నాటారు. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, అధికారులు సైతం మొక్కలు నాటారు. అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

















