ప్రతిపక్షం, ఆగస్టు 07: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు హైదరాబాద్ నగరం, హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని రహదారి అభివృద్ధి పనులను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రోడ్ నెట్వర్క్ విస్తరణ, కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో హెచ్ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, నిధుల సమీకరణ, నిర్వహణతో పాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్), ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ప్రధాన రహదారుల నిర్వహణను సమన్వయంతో ఒకే వ్యవస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలని సీఎం సూచించారు.
ఓఆర్ఆర్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, రహదారిపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేయకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించిన సీఎం, కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న రేడియల్ రోడ్-1ను డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకులను వెంటనే తొలగించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని, బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మాణంతో పాటు బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.
హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధి రహదారి మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి, రోడ్ల విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యానికి తావు లేకుండా చూడాలని, టీడీఆర్‌ల జారీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.





















