[t4b-ticker]

సవతుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి, భయంతో మరో భార్య ఆత్మహత్య!

ప్రతిపక్షం, ఆగస్టు 09: కుటుంబ కలహాలు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళల ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సవతుల మధ్య జరిగిన గొడవలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఆ ఘటనతో భయాందోళనకు గురైన మరో మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వాంకిడి మండలం సోనాపూర్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.

సోనాపూర్‌కు చెందిన ఆత్రం కన్నుకు రాంబాయి, సాకృబాయి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఈ నెల 5న ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రాంబాయి కర్రతో సాకృబాయిపై దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన సాకృబాయిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతి చెందింది.

సాకృబాయి మృతి చెందిన విషయం తెలియడంతో రాంబాయి తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె గ్రామానికి దూరంగా ఉన్న ఓ పొలంలో తలదాచుకుంది. తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలియడంతో మరింత ఆందోళనకు గురైన రాంబాయి.. శనివారం మధ్యాహ్నం అదే పొలంలో పురుగు మందు తాగినట్లు సమాచారం.

కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గంలోనే రాంబాయి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడంతో సోనాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సవతుల మధ్య గొడవకు దారితీసిన కారణాలు, దాడి జరిగిన తీరు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Spread the love

Related News

Latest News