ప్రతిపక్షం, ఆగస్టు 20: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సుస్మిత వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలకు కాంగ్రెస్ మహిళా నేత ఇందిరా శోభన్ ఘాటుగా స్పందించారు. పార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ క్రమశిక్షణ, పార్టీ నిర్ణయాలను గౌరవించాలని ఆమె సూచించారు. సుస్మిత వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శల స్థాయికి వెళ్లడం సరికాదని అన్నారు.
సీఎంను పార్టీ లైన్ దాటి విమర్శించే అధికారం సుస్మితకు ఎవరిచ్చారని ఇందిరా శోభన్ ప్రశ్నించారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నానని చెప్పుకుంటూ పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రిని బహిరంగంగా విమర్శించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పార్టీ వ్యవహారాలపై మాట్లాడేటప్పుడు ముందుగా పార్టీ నిర్ణయాలు, విధానాలను అర్థం చేసుకోవాలని సూచించారు.
‘పచ్చ కాంగ్రెస్’ అంటూ విమర్శలు చేయడం కాకుండా పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాలని ఆమె అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడి రాజకీయంగా చులకన కావొద్దని హితవు పలికారు. ముఖ్యంగా వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు.
అలాగే తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేయడం కూడా తగదని ఇందిరా శోభన్ అన్నారు. తల్లిదండ్రుల చాటున రాజకీయాలు చేస్తూ ముఖ్యమంత్రిని ప్రశ్నించే హక్కు ఎక్కడి నుంచి వచ్చిందని సుస్మితను ప్రశ్నించారు. ‘నువ్వు పార్టీలో ఉన్నావా?’ అంటూ ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇటీవల కొండా సుస్మిత పరకాల రాజకీయాలపై మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. పరకాల టికెట్ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆమె ప్రశ్నించడంతోపాటు, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయడం, సుస్మిత వ్యాఖ్యలపై వివరణ కోరడం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని పెంచింది. గతంలోనూ సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖ వివరణ ఇవ్వాల్సి వచ్చిన నేపథ్యంలో.. తాజా పరిణామాలు కొండా కుటుంబానికి, కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య మరోసారి విభేదాలకు దారితీస్తాయా అనే చర్చ జరుగుతోంది.
ఇదే సమయంలో ఇందిరా శోభన్ చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమవుతున్నాయనే చర్చకు కారణమయ్యాయి. ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అంటూ సుస్మితను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఆమె.. సినిమా డైలాగులు కొట్టడం సులభమే కానీ రాజకీయాల్లో బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. ‘నీతో ఎవరు ఈ మాటలు మాట్లాడిస్తున్నారు? ఇంట్లో అందరికీ పదవులు కావాలా?’ అంటూ ప్రశ్నించారు.
అయితే సుస్మిత తనకు బంధువైనప్పటికీ రాజకీయ అంశాల్లో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ప్రశ్నించాల్సిందేనని ఇందిరా శోభన్ స్పష్టం చేశారు. ‘మా అక్క కూతురు కాబట్టి నీకు గౌరవం ఇస్తున్నా’ అంటూ ఆమె వ్యాఖ్యానించడం ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలపై చర్చకు దారితీసింది.
మొత్తంగా కొండా సుస్మిత వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు కాంగ్రెస్‌లో నేతల పరస్పర విమర్శలకు దారితీస్తోంది. ఒకవైపు క్రమశిక్షణ కమిటీ చర్యలు, మరోవైపు పార్టీ నేతల బహిరంగ వ్యాఖ్యలతో ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.



























