[t4b-ticker]

చండూరు మండలంలో పంట పొలాలను సందర్శించిన ఏడీఏ వేణుగోపాల్ డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలన.

*పంట మార్పిడి చేసిన రైతు వడ్డేపల్లి యాదయ్యను అభినందించిన ఏడీఏ .

ప్రతి పక్షం చండూరు ఆగస్టు 24: చండూరు మండలంలో సోమవారం రోజున వ్యవసాయ శాఖ ఏడీఏ వేణుగోపాల్ గారు మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి పంట పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు.అంగడిపేట గ్రామంలో జరుగుతున్న డిజిటల్ క్రాప్ సర్వే (DCS – Digital Crop Survey) కార్యక్రమాన్ని ఏడీఏ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. పొలాల వద్దకు వెళ్లి వాలంటీర్లు యాప్ లో పంటలను ఎలా నమోదు చేస్తున్నారో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డిజిటల్ క్రాప్ సర్వే అనేది రైతులకు, ప్రభుత్వానికి ఎంతో కీలకమైనదని, ప్రభుత్వ పథకాలు, పంటల బీమా, రుణాలు, కనీస మద్దతు ధర వంటి అన్నింటికీ ఈ సర్వేయే ఆధారమని తెలిపారు.

DCS వాలంటీర్లకు దిశానిర్దేశం చేస్తూ… ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, ప్రతి సర్వే నంబర్ లోని ప్రతి పంటను క్షేత్రస్థాయికి వెళ్లి, కచ్చితమైన ఫోటోలతో, ఖచ్చితమైన డేటాతో DCS యాప్ లో నమోదు చేయాలని సూచించారు. రైతులు కూడా తమ పంట వివరాలను సరిగ్గా నమోదు చేయించుకోవాలని, తద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులకు అవగాహన కల్పించారు.అనంతరం చండూరు గ్రామ రెవెన్యూ పరిధిలో క్రాప్ డైవర్సిఫికేషన్ (పంటల మార్పిడి) విధానాన్ని పాటిస్తున్న ఆదర్శ రైతు వడ్డేపల్లి యాదయ్య పొలాన్ని సందర్శించారు. యాదయ్య తనకున్న 5 ఎకరాల పొలంలో 5 ఎకరాలు వరి వేయకుండా, ఒక ఎకరంలో ఎండుమిర్చి, ఒక ఎకరంలో వరి, మూడు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయడం పట్ల ఏడీఏ గారు హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో కేవలం వరి పంటపైనే ఆధారపడకుండా ఇలా పంట మార్పిడి చేయడం వల్ల నీటి వినియోగం తగ్గడంతో పాటు, రైతుకు ఆర్థికంగా కూడా మేలు జరుగుతుందని అన్నారు. ఇలాంటి ఆదర్శ రైతులను చూసి మండలంలోని ఇతర రైతులు కూడా పంట మార్పిడి వైపు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. పత్తి, మిర్చి పంటల్లో ప్రస్తుతం తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, ఎరువుల వాడకం గురించి రైతుకు తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో చండూరు మండల వ్యవసాయ అధికారి మల్లేష్, హార్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్, ఏఈఓ జగన్, DCS వాలంటీర్ వెంకన్న, ప్రగతిశీల రైతులు పాల్వాయి శేఖర్ రెడ్డి, నెట్టు రాములు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News