[t4b-ticker]

అయోధ్య టెంపుల్‌కు రూ.4కోట్ల చెక్.. అకౌంట్లో బ్యాలెన్స్ రూ.3!

ప్రతిపక్షం, ఆగస్టు 31: అయోధ్య రామ మందిరానికి ఓ భక్తురాలు భారీ విరాళం అందించేందుకు ఇచ్చిన రూ.4 కోట్ల చెక్‌ బౌన్స్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. చెక్‌ను నగదుగా మార్చేందుకు ఆలయ ట్రస్ట్‌ నిర్వాహకులు ప్రయత్నించగా, సంబంధిత బ్యాంకు ఖాతాలో కేవలం రూ.3 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.

తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు ఇటీవల అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రూ.4 కోట్ల విరాళం ఇస్తున్నట్లు పేర్కొంటూ ఆలయ సిబ్బందికి చెక్‌ అందజేశారు. భారీ మొత్తానికి సంబంధించిన చెక్‌ కావడంతో ఆలయ ట్రస్ట్‌ నిర్వాహకులు దానిని బ్యాంకులో జమ చేసి నగదు పొందేందుకు చర్యలు చేపట్టారు.

అయితే చెక్‌ జారీ చేసిన ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో చెక్‌ బౌన్స్‌ అయింది. ఖాతాను పరిశీలించిన ట్రస్ట్‌ నిర్వాహకులు అందులో కేవలం రూ.3 మాత్రమే ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు. రూ.4 కోట్ల చెక్‌ ఇచ్చిన వ్యక్తి ఖాతాలో కనీసం ఆ మొత్తానికి సరిపడా నగదు లేకపోవడం ఆలయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఈ వ్యవహారంపై ఆలయ ట్రస్ట్‌ నిర్వాహకులు సదరు భక్తురాలిని వివరణ కోరాలని నిర్ణయించినట్లు సమాచారం. చెక్‌ ఎందుకు బౌన్స్‌ అయిందో, రూ.4 కోట్ల విరాళానికి సంబంధించి ఆమె ఉద్దేశం ఏమిటో తెలుసుకునేందుకు నోటీసులు పంపనున్నట్లు ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు.

అయితే భద్రతా కారణాల దృష్ట్యా చెక్‌ ఇచ్చిన భక్తురాలి పేరు, ఇతర వ్యక్తిగత వివరాలను వెల్లడించలేమని ఆలయ ట్రస్ట్‌ వర్గాలు స్పష్టం చేశాయి. భారీ మొత్తంలో విరాళం ఇస్తున్నట్లు ప్రకటించి, ఖాతాలో కేవలం రూ.3 మాత్రమే ఉండటంతో ఈ ఘటన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Spread the love

Related News

Latest News